Wednesday, 20 November 2024

సిపాయి

వాడని వీడి వీధిని వీడి  

ఇంటిని వదిలి  ఇంతిని వదిలి 

నిప్పుని తొక్కి మంచుని ఎక్కి 

కన్నీటి బొట్టుని  తూటా చేసి 

శత్రు గుండెల్లో నిలువుగా దింపి 

 ఆ రుధిరం భారతమాత  నుదుటి దిద్ది 

కన్న వారి కోసం ఉన్న ఊరి తోవ పట్టి 

చిన్ని పాప బోసి నవ్వు 

చిన్న నాటి దోస్తు పలకరింపు 

వేచి ఉన్న వీర నారి  జ్ఞాపకాలు 

నీరదాలై  నీ గుండెలనిండా వర్షిస్తుంటే 

అప్పుడు..... 

మత రక్కసుల కరాళ నృత్యం కాల రాయటానికి పిలుపొస్తుంది 

మాతృభూమి పరిరక్షణకి బంధాలు  తెంచుకొని 

మరల కత్తి బట్టి దేశద్రోహుల తలలు కొట్టి 


నువ్వు తిరిగి వస్తావు 


జెండా పట్టుకొని వస్తావో, చుట్టబెట్టుకొని వస్తావో 

ఒక్క తుపాకీ చేబూని వేంచేస్తావో, వంద తుపాకులు గర్జిస్తుంటే అంబరం నుండి వందనం చేస్తావో 

 ఆ వీర గాధల విజయ  గురుతులతో వస్తావో  నీవే తీపి గుర్తుగా ఉండి  పోతావో!